పిఎంఏవై పధకం లో ఇచ్చిన రాయితీ రూ.2,38,866 చెల్లించాలని నోటీసులు ఇవ్వడంపై సుజాతనగర్ కు చెందిన రెడ్డి శ్రీరామ్ ఆవేదన.
విశాఖ లోకల్ న్యూస్ :పెందుర్తి ప్రతినిధి
ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయకుండానే ప్రభుత్వ రికార్డుల్లో మాకు ఇల్లు మంజూరు చేసినట్లు ఉందని ఆ కారణంగా బ్యాంకులో తమకు ఇచ్చిన పిఎంఏవై పధకం లో ఇచ్చిన రాయితీ రూ.2,38,866 చెల్లించాలని నోటీసులు ఇవ్వడంపై సుజాతనగర్ కు చెందిన రెడ్డి శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు రెడ్డి శ్రీరామ్ చెప్పిన ప్రకారం ఇలా ఉన్నాయి. రెడ్డి శ్రీరామ్ గతంలో ప్రహలాదపురం లో అద్దె ఇంట్లో ఉన్న సమయంలో తన తల్లి పేరున హౌసింగ్ స్కీమ్ ఇల్లు కోసం 2012వ సంవత్సరంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అప్పుడు ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరు చేయలేదు. దాంతో కొన్నాళ్లకు 90% బ్యాంకు లోన్ తీసుకుని సుజాతనగర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కున్నాడు. లోన్ తీసుకున్న సమయంలో బ్యాంక్ వారు పీఎంఏవై పధకం కింద రూ.2,36,866 రాయితీ ఇచ్చారు. ఇటీవల కరోనా సమయంలో ప్రభుత్వం వడ్డీ రేట్లు తగ్గించినా మేము తీసుకున్న ఒక ప్రైవేట్ బ్యాంకు మాత్రం వడ్డీ తగ్గించలేదు. దాంతో మేము వేరొక ప్రభుత్వ బ్యాంకు కు తమ లోను మార్చుకోవడానికి ఆ ప్రైవేట్ బ్యాంకు తెలియజేయగా ఇప్పుడు వారు మాకు ప్రభుత్వ ఇల్లు మంజూరై ఉన్నదని, పి ఎం ఏ వై పథకం మీకు వర్తించదని, కాబట్టి మీకు రాయితీ ఇచ్చిన రూ.2,36,866 చెల్లించాలని మాకు లేఖను ఇచ్చారని శ్రీరామ్ తెలిపారు. మాకు ప్రభుత్వం ఎటువంటి ఇల్లు మంజూరు చేయకపోయినా మాకు ఈ సొమ్మును చెల్లించ మనడం అన్యాయమని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులను ఎన్నిసార్లు సంప్రదించినా తగిన న్యాయం చేయడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
