శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం.

శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం

శ్రీశైలం:

శ్రీశైలం ఆలయం: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రం కార్తిక తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద, ఉత్తర, దక్షిణ మాడవీధుల్లో భక్తులు కార్తిక దీపారాధనలు నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కనులపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదికపైకి తీసుకువచ్చి అర్చకులు, వేదపండితులు దశవిధ హారతులు సమర్పించారు. వేలాదిమంది భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొని కార్తిక దీపాలను వెలిగించారు.