చెత్తను తొలగించండి మహాప్రభో : రేగుంట ప్రజల వేడుకోలు

చెత్తను తొలగించండి మహాప్రభో : రేగుంట ప్రజల వేడుకోలు


నూజివీడు: వి న్యూస్  : జనవరి 01 :

నూజివీడు మండలం ఎనమదల గ్రామపంచాయతీ శివారు రేగుంట గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి దూరంగా ఉన్న ప్రాంతాన్ని  డంపింగ్ యార్డ్ గా ఏర్పాటుచేసి చెత్తను తరలించాలని ప్రజలు కోరారు. గ్రామంలోని ప్రధానమైన సెంటర్ వద్ద పాఠశాల, క్రీడ మైదానం, నివాసాలు ఉండడంతో సమీపంలో ఉన్న చెత్తాచెదారం వలన తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందుతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. చెత్త కుప్పలను పందులు కుక్కలు రోడ్లపై చిమ్ముతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గ్రీన్ అంబాసిడర్లు, చెత్త తరలించే వాహనాలు ఎక్కడ...?!


ఇంతటి దారుణమైన స్థితి గ్రామంలో చోటుచేసుకుని ఉంటే గ్రామపంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఏమీ పట్టకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు ప్రవేశపెట్టిన తరువాత ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే కార్యక్రమం కోసం ప్రతి గ్రామపంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లు, చెత్తను దూరంగా తరలించే వాహనాలను ఏర్పాటు చేశారు. ఆ వాహనాలు, గ్రీన్ అంబాసిడర్ లు ఏమైనట్లని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి తక్షణమే చెత్తను ఊరికి, జనావాసాలకు దూరంగా తరలించాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.